నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ
ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంఅమెరికా, 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ట్రాన్స్-పసిఫిక్ పాట్నర్‌షిప్-టీపీపీ) కుదిరింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ పసిఫిక్ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వేల సంఖ్యలో సుంకాలు రద్దుకానున్నాయి. దీంతో పాటు చైనా ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జీడీపీ (2012) 40 శాతంగా ఉంది.
మూడు దేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటనజోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్టోబర్ 10న జోర్డాన్ చేరుకునన్నారు. ఆ దేశ పాలకుడు కింగ్ అబ్దుల్లాతో ప్రణబ్ సమావేశమయ్యారు.ఈ మేరకు ఇరు దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్‌లోని అమ్మన్‌లో గాంధీ పేరిట ఏర్పాటుచేసిన ఓ వీధిని ప్రణబ్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్ సిటీ కౌన్సిల్ ఆయనకు ‘గోల్డెన్ కీ ఆఫ్ అమ్మాన్’ను బహూకరించింది.
అనంతరం అక్టోబర్ 12న ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమై చర్చించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనాకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలియజేశారు. పాలస్తీనా అథారిటీకి భారత్ రూ. 32.3 కోట్ల చెక్కును బడ్జెటరీ మద్దతుగా అందించింది. అలాగే.. పాలస్తీనా భూభాగంలో రమల్లాలో టెక్నాలజీ పార్కు సహా ఐదు ప్రాజెక్టుల కోసం రూ. 115 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
ఆఖరిగా ఇజ్రాయిల్‌లో పర్యటించిన రాష్ట్రపతి అక్టోబర్ 14న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. పశ్చిమాసియాలో సాగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
దారిద్య్రరేఖను సవరించిన ప్రపంచ బ్యాంకుప్రపంచ దారిద్రరేఖను ప్రపంచ బ్యాంకు సవరించింది. ఇప్పటి వరకు రోజుకు 1.25 డాలర్లు సంపాదించే వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న వారిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రోజు వారీ సంపాదనను 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు (రూ.130) సవరించింది.
భారత్‌తో అనిశ్చితి తొలగింపునకు నేపాల్ త్రిసభ్య బృందంభారత్‌తో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, దౌత్య అనిశ్చితికి తెరదించేందుకుగాను నేపాల్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని అక్టోబర్ 9న నియమించింది. ఈ సమస్యతోపాటు పెట్రోలియం ఉత్పత్తులు సహా నిత్యావసరాల సరఫరా సాఫీగా సాగేలా ఈ బృందం భారత్‌తో చర్చలు జరుపుతుంది. ఈ బృందానికి విదేశాంగ మంత్రి మహేంద్ర బహదుర్ పాండే నాయకత్వం వహించనున్నారు. ఇంకా ఈ బృంద సభ్యులుగా నేపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ్‌లాల్ సుబేడి, వాణిజ్య. పౌరసరఫరా శాఖ కార్యదర్శి ప్రసాద్ ఉపాధ్యాయ సభ్యులుగా నియమితులయ్యారు.
టర్కీలో బాంబు పేళుల్లు: 86 మంది మృతిటర్కీ రాజధాని అంకారాలో అక్టోబర్ 10న ఉగ్రవాదులు జరిపిన బాంబు పేళ్లులో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 186 మంది గాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా ఉగ్రవాదులు రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 24 మంది కన్నుమూసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యూజినోగ్లు తెలిపారు. అంకారా నగర చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడిని దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఖండించారు.
ఫిజి తదుపరి అధ్యక్షుడు జియోజిఫిజి తదుపరి అధ్యక్షుడిగా ఆ దేశ ఉపాధి శాఖ మంత్రి జియోజి కొనౌసి కొన్రోటే అక్టోబర్ 12న ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలో అధికార ఫిజి ఫస్ట్ పార్టీ ఆయనను బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో జియోజీకి 31 ఓట్లు రాగా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రటు ఎపేలి గనిలావ్‌కు కేవలం 14 ఓట్లే దక్కాయి. ఫిజి రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు తమ తరఫున ఒకరిని అధ్యక్ష పదవి ఎన్నికల బరిలోకి దించుతారు. మెజారిటీ ఓట్లు దక్కించుకున్న వ్యక్తి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
బ్రహ్మపుత్రపై చైనా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంటిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టును చైనా అక్టోబర్ 13న ప్రారంభించింది. సుమారు రూ. 9764 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ జామ్ హైడ్రోపవర్ స్టేషన్‌లో 2.5 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది టిబెట్‌లోనే అత్యంత పెద్ద డామ్. ఈ స్టేషన్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో సెంట్రల్ టిబెట్ విద్యుత్ కొరతను తీర్చవచ్చు. చైనా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా వరదలప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశముందని గతంలోనే భారత మంత్రిత్వ శాఖల అంతర్గత నిపుణుల బృందం అభిప్రాయపడింది. భారత సరిహద్దుకు 550 కిలోమీటర్ల దూరంలో మాత్రమే డ్యామ్‌లు నిర్వహించాలని సూచించింది.
అణు ఒప్పందానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదంప్రపంచ దేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ పార్లమెంట్ అక్టోబర్ 13న ఆమోదముద్ర వేసింది. 250 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో ఒప్పందాన్ని బలపరిచే తీర్మానానికి(జేసీపీవోఏ) అనుకూలంగా 161 మంది ఓటేశారు. రెండేళ్ల చర్చోపచర్చల అనంతరం ఈ ఏడాది జూలై 14న ఇరాన్, ఆరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇరాన్‌పై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు 2016 జనవరి కల్లా తొలగిపోతాయి. అదే సమయంలో ఇరాన్ కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)ను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. శాంతియుత ప్రయోజనాల కోసమే అణు ఇంధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు నమ్మకం కలిగించాలి.
పట్టణ రవాణాపై భారత్- స్వీడన్ మధ్య ఒప్పందంరవాణా వ్యవస్థ మెరుగుపరచడం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, డిజిటలైజేషన్‌కు సంబంధించి దేశంలో తలపెట్టిన నూతన పథకాల అమలులో సహకారం కోసం భారత్-స్వీడన్ మధ్య ఒప్పందం కుదిరింది. స్వీడన్ పట్టణాభివృద్ధి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మెహ్మెట్ కప్లాన్, భారత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అక్టోబర్ 13న భేటీ అయ్యారు. పట్టణాల సుస్థిర ప్రగతికి అవసరమైన ప్రాజెక్టులను గుర్తించాలని వారు నిర్ణయించారు. ద్రవ, ఘనవ్యర్థాలనుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి తమ దేశం అన్నివిధాలుగా సహకరిస్తుందని కప్లాన్ హామీ ఇచ్చారు.
జాతీయంబీహార్ తొలిదశలో 57 శాతం పోలింగ్బీహార్ శాసనసభకు అక్టోబరు 12న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 57 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 54.5 శాతం మంది పురుషులు, 59.5 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశలో 49 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ నాయక్ తెలిపారు.
అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్’ పుస్తకావిష్కరణపాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్-యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించారు. అక్టోబర్ 12న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్‌ఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణితో కలసి కసూరి పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ముంబై నగరంలో పాకిస్తాన్‌కు చెందిన పుస్తకావిష్కరణను వ్యతిరేకించిన శివసేన కార్యకర్తలు.. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న సుధీంద్ర కులకర్ణిని అడ్డుకుని ఆయనపై సిరాతో దాడి చేశారు. ముఖంపై, దుస్తులపై నల్లరంగు పులిమారు. దీంతో పటిష్ట పోలీసు భద్రత నడుమ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జనవరి నుంచి నేతాజీ ఫైళ్లు బహిర్గతంనేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని మోదీ అక్టోబర్ 14న అధికారికంగా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్‌లో ఈ మేరకు సమావేశమయ్యారు.
రాష్ట్రీయం22న అమరావతి శంకుస్థాపనఅక్టోబరు 22న జరగనున్న రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల10న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు పేజీల ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. అక్టోబరు 22, మధ్యాహ్నం 12.45 గంటలకు అమరావతి శంకుస్థాపన జరగనున్నట్లు ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.
8 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.1,240 కోట్ల విలువైన ఈ ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, ఆయా సంస్థల ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు.
కమలనాథన్ కమిటీ గడువు పొడిగింపుతెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి నియమించిన కమలనాథన్ కమిటీ గడువును 2016 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 అక్టోబర్ 31తో కమిటీ గడువు ముగియాల్సి ఉంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా 16,924 మందిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ తాత్కాలిక జాబితాలను కమిటీ ప్రకటించింది. కొన్ని విభాగాల్లో తుది జాబితాలు సైతం వెల్లడించినప్పటికీ.. హోంశాఖకు సంబంధించిన కసరత్తు ఇప్పుడిప్పుడే మొదలైంది. దీంతో కేంద్రం కమిటీ గడువును పొడిగించింది.
మెగా సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతి
ఏపీలో వ్యవసాయ ‘ఈ-మార్కెటింగ్’ ప్రారంభంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో(ఏఎంసీ) వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించుకొనే(ఈ-మార్కెటింగ్) విధానాన్ని అక్టోబర్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. దళారుల వ్యవస్థ లేకుండా, సరైన ధర దక్కేలా, ఎక్కడి నుంచైనా ఉత్పత్తులను అమ్ముకునేలా ఈ విధానం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంపై రాష్ట్రీయ ఈ-మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(బెంగుళూరు), నేషనల్ ఈ-మార్కెటింగ్ లిమిటెడ్ (ముంబై), ఏపీ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డుల్లో ఉల్లిపాయలు, ఆధోనిలో ఆముదం, వేరుశెనగ, కడపలో వేరుశెనగ, హిందూపురంలో చింతపండు, గుంటూరులో మిర్చి, పత్తి, ఏలూరులో నిమ్మకాయలు, అనకాపల్లి మార్కెట్ యార్డుల్లో బెల్లం అమ్మకాలకు ఈ-మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మూడు దశల్లో రాష్ట్రంలోని 190 యార్డుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
హైదరాబాద్‌లోని ఆర్‌సీఐకి కలాం పేరుహైదరాబాద్‌లో రక్షణ రంగానికి చెందిన మిస్సైల్ కాంప్లెక్స్ ‘ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)’ పేరును ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్’గా మార్చారు. 1982లో ఆర్‌సీఐలో చేరిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు దీంతో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. కలాం 84వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్‌సీఐలో అడ్వాన్స్డ్‌సిస్టమ్ లేబొరేటరీ(ఏఎస్‌ఎల్), డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ లేబొరేటరీ(డీఆర్‌డీఎల్) విభాగాలు ఉన్నాయి.
ఆర్థికంభారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్
వృద్ధిరేటును 7.5 శాతంగా పేర్కొన్న అంక్టాడ్2015 సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)రేటు 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్) అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ దేశాలు కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకొనేందుకు చమురు ధరల తగ్గుదల ఉపయోగపడిందని అభిప్రాయపడింది.
సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే!ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 26.6 బిలియన్ డాలర్ల సంపదతో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ లీ కుటుంబం టాప్‌లో ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజీఅంగారకుడిపై ఇసుక తిన్నెలు
జీవిత కాలాన్ని పెంచే జన్యువులుమనిషి జీవిత కాలం పెంచే దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇటీవల మనిషి వయసును పెంచే 238 జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈస్ట్ కణాలపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ జన్యువులను తొలగించినప్పడు కణాల జీవిత కాలం పెరిగినట్లు గమనించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.
కనిపించని వ్యాధుల జాబితాలో ‘యాస్’!భయంకరమైన చర్మవ్యాధి ‘యాస్’ను దీర్ఘకాలికంగా కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చనున్నారు. ఈ అంటువ్యాధి 2003 నుంచి మన దేశంలో ఎక్కడా నమోదైనట్లు వివరాలు లేవు. దీంతో యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించి వ్యాధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యాధిని కనుమరుగైన వ్యాధుల జాబితాలో చేర్చునున్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటిస్తోంది.
అవార్డులుసాహిత్యంలో స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు నోబెల్
టునీసియా ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు శాంతి నోబెల్‘మల్లెల విప్లవం’ అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)’కు 2015 శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ ‘క్వార్టెట్’ కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. 2011లో టునీసియాలో నిరంకుశ ప్రభుత్వంపై చెలరేగిన తిరుగుబాటు.. ఆ తర్వాత వరుసగా అరబ్ దేశాల్లో విప్లవాలకు దారితీసింది. దీనినే ‘మల్లెల విప్లవం (జాస్మిన్ రివల్యూషన్)’గా పిలుస్తారు. దీని కారణంగా చాలా అరబ్ దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు కూలిపోయి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటుకావడానికి మార్గం ఏర్పడింది. అయితే ఈ తిరుగుబాటు అనంతరం టునీసియాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశానికి చెందిన ‘టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్, టునీసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హాండిక్రాఫ్ట్స్, టునీసియన్ హ్యూమన్ రైట్స్ లీగ్, టునీసియన్ ఆర్డర్ ఆఫ్ లాయర్స్’ సంస్థలు కలసి 2013లో ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’గా ఏర్పడ్డాయి. ఇస్లామిక్ వాదుల ఆధిపత్యంలోని ప్రభుత్వానికి, తిరుగుబాటు లేవదీసిన విపక్షాలకు ఈ ‘క్వార్టెట్’ మధ్యవర్తిత్వం వహించింది. విస్తృత చర్చల ద్వారా అన్నివర్గాల మధ్య రాజీ కుదిర్చి.. శాంతికి, ప్రజాస్వామ్యానికి బాటలు వేసింది.
ఆంగస్ డేటన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) 2015 సంవత్సరం ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో మార్పుకు, ఆర్థికశాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 12న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఏపీ జెన్‌కో ఎండీకి బెస్ట్ బ్యూరోక్రాట్ అవార్డుఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ విజయానంద్ ఉత్తమ ఉన్నతాధికారి (బెస్ట్ బ్యూరోక్రాట్) అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీ జెన్‌కోకు అత్యుత్తమ సామర్థ్యం గల సంస్థగా అవార్డు లభించింది. ఢిల్లీకి చెందిన జాతీయ సంస్థ ఎనర్షియా ఈ అవార్డులను ప్రకటించింది. ఈ సంస్థ ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థల పనితీరుపై అధ్యయనం చేసి, అవార్డులను ప్రకటిస్తుంది.
పార్వతి బారువాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుఅసోంకు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలు పార్వతి బారువాను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. కోల్‌కతాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ వైల్డ్‌లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో అక్టోబర్ 12న ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఆమె గౌరీపూర్ బారువాస్ రాజకుటుంబానికి చెందిన వారు. వన్యప్రాణి సంరక్షణకు ఆమె చేసిన నిర్విరామ కృషికి ఈ అవార్డు లభించింది. ఆమె జీవిత కథ ఆధారంగా బీబీసీ రూపొందించిన ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ డాక్యుమెంటరీతో ఆమె వెలుగులోకి వచ్చారు.
ఆదూర్ గోపాలకృష్ణన్‌కు పరబ్రహ్మ చైతన్య పురస్కారంసాంస్కృతిక రంగంలో విశిష్ట సేవలకుగాను ప్రముఖ సినిమా దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్... 2015 పరబ్రహ్మ చైతన్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జ్యూరీ చైర్మన్, కేరళ చలనచిత్ర అకాడమీ మాజీ అధ్యక్షుడు కేఆర్ మోహనన్ అక్టోబర్ 13న వెల్లడించారు. ఓంటకూరలోని పడనిలం పరబ్రహ్మ ఆలయ యాజమాన్యం ఏర్పాటుచేసిన ఈ అవార్డు కింద ఓ ప్రశంసాపత్రంతోపాటు రూ. 25 వేల నగదు అంద జేస్తారు. ఈ ఏడాది నవంబర్ 17వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అదూర్‌కు అందజేస్తారు.
పీవీ రాజగోపాల్‌కు ఇందిరా సమైక్యత అవార్డుప్రముఖ గాంధేయవాది పీవీ రాజగోపాల్.. 29వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ సమైక్యత విషయంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2013-14 సంవత్సరానికి గానూ ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు అవార్డు అడ్వైజరీ కమిటీ అక్టోబర్ 14న విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతోపాటు రూ. 10లక్షల నగదు బహుమతిగా ఇస్తారు.
జమైకా రచయితకు మాన్ బుకర్ ప్రైజ్ప్రతిష్టాత్మక మాన్ బుక్ ప్రైజ్ 2015ను జమైకా రచయిత మార్లన్ జేమ్స్(44) అందుకున్నారు. ఆయన రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ నవల ఈ అవార్డుకు ఎంపికైంది. జమైకా రచయితకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే ప్రథమం. బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయుడు సంజీవ్ సహోటా రచించిన ‘ది ఇయర్ ఆఫ్ రన్ అవేస్’ నవల తుది జాబితాలో నిలిచింది. అక్టోబర్ 13న లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు.
వార్తల్లో వ్యక్తులుడేర్ డెరైక్టర్‌గా మహేశ్వర రెడ్డిరక్షణ వైమానిక పరిశోధన సంస్థ (డేర్) డెరైక్టర్‌గా డాక్టర్ కె.మహేశ్వర రెడ్డి నియమితులయ్యారు. డీఆర్‌డీఓలోని ముఖ్యవిభాగమైన డేర్ భారత సాయుధ బలగాలకు అత్యాధునిక వైమానిక యుద్ధ వ్యవస్థలను, ఎలక్ట్రానిక్ పరికరాలను అందించేందుకు నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తుంది. డాక్టర్ మహేశ్వర రెడ్డి రాడార్, లేజర్, మిస్సైల్ హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేశారు. విభిన్నమైన రాడార్ హెచ్చరిక స్వీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేసినందుకు 2007, 2009లో ఆయన అవార్డులు అందుకున్నారు.
యూఎన్ వాతావరణ మార్పు ప్యానెల్ చైర్మన్‌గా హోసుంగ్ లీఐక్యరాజ్యసమితి (యూఎన్) వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ ప్యానెల్‌కు (ఐపీసీసీ) చైర్మన్‌గా కొరియన్ ప్రొఫెసర్ హోసుంగ్ లీ అక్టోబరు 6న ఎన్నికయ్యారు. క్రోయేషియాలోని దుబ్రోవ్‌నిక్‌లో జరిగే సదస్సుకు ఆయన నేతృత్వం వహించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్‌కే పచౌరీ (భారత్) ఈ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో హోసుంగ్ లీ ఎన్నికయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత
ప్రముఖ నటి మనోరమ కన్నుమూతప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 సినిమాల్లో మనోరమ నటించారు. 1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించిన మనోరమ 1958లో పెరియ కోవిల్ అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. 1980లో శుభోదయం సినిమాతో తెలుగులో రంగ ప్రవేశం చేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా మనోరమ గిన్నిస్ రికార్డు సృష్టించారు.
క్రీడలుకర్జాకిన్‌కు ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. బాకు (అజర్‌బైజాన్)లో అక్టోబరు 6న జరిగిన ఫైనల్లో పీటర్ స్విద్లెర్ (రష్యా)పై కర్జాకిన్ విజయం సాధించాడు.
టి20 సిరీస్ విజేత దక్షిణాఫ్రికాభారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. ధర్మశాల, కటక్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. అక్టోబర్ 8న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. జేపీ డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ కోల్పోయి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగునుంచి ఆరో స్థానానికి పడిపోగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది.
డచ్ ఓపెన్ విజేత జయరామ్
పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. బ్రిటన్‌లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో అక్టోబర్ 11న జరిగిన టోర్నమెంట్‌లో నైజల్ షార్ట్ (ఇంగ్లండ్)ను తొమ్మిదో రౌండ్‌లో 50 ఎత్తుల్లో డ్రాగా ముగించి టైటిల్‌ను సాధించాడు. లారెంట్, గాబ్రియెల్‌లకు వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడిఅక్టోబర్ 10న జరిగిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట విజయం సాధించింది. వీరు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)జోడీని ఓడించి టైటిల్ సాధించింది.
ఫిఫా చీఫ్ బ్లాటర్‌పై వేటుఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ప్రధాన కార్యదర్శి జెరోమ్ వాల్కేతో పాటు యూఈఎఫ్‌ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై 90 రోజుల తాత్కాలిక నిషేధం విధించారు. వీరిపై క్రిమినల్ విచారణలో భాగంగా ఫిఫాకు చెందిన స్వతంత్ర ఎథిక్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాటినికి గట్టిపోటీదారుగా భావిస్తున్న కొరియా బిలియనీర్ చుంగ్ మోంగ్ జూన్‌పై కూడా ఆరేళ్ల నిషేధంతో పాటు లక్షా 3 వేల డాలర్ల జరిమానా పడింది. దీంతో ఈ నలుగురు ఏరకమైన ఫుట్‌బాల్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీల్లేదు.
ప్రొఫెషనల్ కెరీర్‌లో విజేందర్ తొలి గెలుపుఅమెచ్యూర్ బాక్సింగ్‌ను వదిలి ప్రొఫెషనల్ కెరీర్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే ఈ హరియానా బాక్సర్ విజయం సాధించాడు. బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌తో అక్టోబర్ 10న జరిగిన మిడిల్‌వెయిట్ బౌట్‌లో విజేందర్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో జయభేరి మోగించాడు.
రష్యా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత హామిల్టన్రష్యా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 2015 సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్. మొత్తంగా హామిల్టన్ కెరీర్‌లో ఇది 42వ టైటిల్. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు.
భారత బాడీబిల్డర్ శ్వేత కొత్త చరిత్రఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్‌గా శ్వేతా రాథోడ్ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన 25 ఏళ్ల శ్వేత ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫిట్‌నెస్ ఫిజిక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. తద్వారా వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇంజినీరింగ్ చదివిన శ్వేత ముంబైలో ఫిట్‌నెస్ ఫరెవర్ పేరుతో అకాడమీని నిర్వహిస్తోంది. 2015లో ముంబైలోనే జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో శ్వేతకు కాంస్య పతకం లభించింది.
ర్యాపిడ్ చెస్ చాంపియన్ కార్ల్‌సన్ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) నిలిచాడు. బెర్లిన్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో కార్ల్‌సన్ 11.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో కూడా కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. 10.5 పాయింట్లతో ఇయాన్ నెపోమ్‌నియాచి (రష్యా), తెమౌర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
రొనాల్డోకు నాలుగోసారి ‘గోల్డెన్ బూట్’యూరోప్‌లో జరిగే దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌లలో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచినందుకు... రియల్ మాడ్రిడ్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రికార్డుస్థాయిలో నాలుగోసారి ‘గోల్డెన్ బూట్’ అవార్డును అందుకున్నాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రొనాల్డో 2014-15 స్పానిష్ లీగ్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 48 గోల్స్ చేశాడు. 2007-08 సీజన్‌లో మాంచెస్టర్ యునెటైడ్ తరఫున తొలిసారి ఈ అవార్డు నెగ్గిన రొనాల్డో మిగతా మూడుసార్లు రియల్ మాడ్రిడ్ తరఫున సాధించాడు.

0 Comments