Ticker posts

9/recent/ticker-posts

Weekly current affairs. (11th January, 2016)

అంతర్జాతీయంపాత్రికేయులకు భారత్ ప్రమాదకరంజర్నలిస్టులకు సంబంధించి ఆసియాలో భారత్ అత్యంత ప్రమాదకర దేశమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది జర్నలిస్టులు అసహజంగా చనిపోతే వారిలో 9 మంది భారతీయులేనని వార్షిక నివేదికలో తెలిపింది. జర్నలిస్టులకు పాక్, అఫ్గాన్‌ల కంటే భారత్ ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో 67 మంది హత్యకు గురైతే, ఇరాక్‌లో అత్యధికంగా 11 మంది హత్యకు గురయ్యారని తెలిపింది.

విజన్ 2030 యూఎన్‌వో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విడుదలCurrent Affirs ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఆకలి, పేదరిక, లింగ భేదం లేని సమాజాన్ని ఏర్పాటు దిశగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వాధినేతలు, ప్రజల మధ్య మానవత్వం, సామాజిక అనుసంధానం కోసం ఈ లక్ష్యాలు ఉపయోగపడతాయని యూఎన్‌వో సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ పేర్కొన్నారు. రానున్న 15 ఏళ్లలో అసమానతలు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీజీ లక్ష్యాలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.

జాతీయంమైసూర్‌లో 103వ సైన్స్ కాంగ్రెస్Current Affirs 103వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 3న మైసూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధనల సమయంలో ఐదు ‘ఇ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ)లను గుర్తుంచుకోవాలని సూచించారు. ‘భారత్‌లో దేశీయ అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఐదు రోజుల ఈ సదస్సులో దేశంలోని 500 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి పఠాన్‌కోట్ (పంజాబ్)లోని భారత వాయుసేన స్థావరంపై జనవరి 2న ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వైమానిక స్థావరంలో ఉన్న మిగ్ 21 ఫైటర్ విమానాలు, ఎంఐ 25 యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేసే ఉద్దేశంతో బలమైన ఆయుధ సంపత్తితో దాడికి దిగారు. ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు జవాన్లు, ఒక లెఫ్టినెంట్ కల్నల్ మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ‘గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థావరంలోని సిబ్బందిని, ఆస్తులను, నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేసి ఎయిర్‌బేస్ భద్రంగా ఉందని నిర్దారించుకునే వరకు అపరేషన్ కొనసాగిస్తాం’ అని ఎన్‌ఎస్‌జీ ఐజీ మేజర్ జనరల్ దుషాంత్ సింగ్ జనవరి 4న పఠాన్‌కోట్‌లో విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో భూకంపందేశంలోని ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో జనవరి 4న భూకంపం సంభవించింది. భూకంపం వల్ల 9 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఐదుగురు మరణించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంప ప్రభావంతో అస్సాం, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లో పలు చోట్ల భూమి కంపించింది. మణిపూర్‌లోని తమెంగ్ లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం నమోదైంది.

సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగల్ కమిటీకొద్ది కాలంగా విమర్శల పాలవుతున్న సెన్సార్ బోర్డును సంస్కరించేందుకు ప్రసిద్ధ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, సినీ విమర్శకురాలు భావన సోమయ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్ ఎండీ నైనా లత్ గుప్తా, సంయుక్త కార్యదర్శి(సినిమాలు) సంజయ్ మూర్తి, ప్రకటనా రంగంలో పనిచేసే పియూష్ పాండే కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ పలు సూచనలతో రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఆరు కీలక చట్టాలకు రాష్ర్టపతి ఆమోదంరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు కీలక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఇందులో భారీ వ్యాపార వివాదాలను పరిష్కరించేందుకు హైకోర్టులకు వీలు కల్పించే చట్టం ముఖ్యమైంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టానికి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ సవరణ చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే సవరణ చట్టం, ద కమర్షియల్ కోర్ట్స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అప్పీలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్స్ యాక్ట్, అణుశక్తి సవరణ చట్టం, ద పేమెంట్ అండ్ బోనస్ సవరణ చట్టం, జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జువనైల్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇకపై అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన 16 నుంచి 18 ఏళ్ల మధ్య మైనర్లను వయోజనులకు ఉద్దేశించిన చట్టాల ప్రకారమే విచారిస్తారు. దోషిగా తేలితే పెద్దల చట్టాల ప్రకారమే శిక్షలు విధిస్తారు.

పారామిలటరీ దళాల్లో మహిళలకు 33% రిజర్వేషన్పారామిలటరీ దళాలైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)ల్లో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో ఇకపై మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాగే, సరిహద్దుల రక్షణ బాధ్యతలు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ల్లోని కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 15% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం లభించిందని జనవరి 5న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దళాల్లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది సాయుధ సైనికులు ఉండగా, వారిలో 20 వేల మంది మాత్రమే మహిళలు. ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో 6300 మంది మహిళలే ఉన్నారు.

వ్యర్థ జలాల శుద్ధికి ప్రత్యేక వ్యవస్థకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే కార్యక్రమంలో భాగంగా వ్యర్థ జలాల శుద్ధికి పీపీపీ(ప్రభుత్వ-ప్రైవేటు భాగసామ్య పద్ధతి) ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కానుంది. సంబంధిత ప్రతిపాదనకు జనవరి 6న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దేశంలో వ్యర్థ జలాల నిర్వహణ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థ కృషి చేయనుంది. దీనికింద ఏర్పాటు చేయబోయే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)... శుద్ధి చేసిన జలాలకు మార్కెటింగ్ వసతి కల్పించే బాధ్యతలను కూడా పర్యవేక్షించనుంది. కంపెనీల చట్టం-2013 ప్రకారం ఏర్పాటు చేయబోయే ఈ ఎస్‌పీవీ స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల నుంచి యూజర్ చార్జీల వసూలు వంటివి ఒప్పందంలో భాగంగా ఉంటాయి.

మూడు హెచ్‌ఎంటీ యూనిట్ల మూసివేతప్రభుత్వ రంగ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు చెందిన మూడు నష్టజాతక యూనిట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. 2007 వేతనస్కేళ్ల ప్రకారం సంబంధిత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)ను అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసివేతకు ప్రతిపాదించిన యూనిట్లలో హెచ్‌ఎంటీ వాచెస్, హెచ్‌ఎంటీ చినార్ వాచెస్, హెచ్‌ఎంటీ బేరింగ్స్ ఉన్నాయి. ఈ మూడూ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఈ మూడింటికీ రూ.427.48 కోట్ల నగదు సాయాన్ని అందించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు వారికి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన బకాయిలతో పాటు ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్/వీఎస్‌ఎస్‌ను కల్పించడం ద్వారా హెచ్‌ఎంటీ నుంచి విడదీసి ఆ తర్వాత మూడు యూనిట్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది.

రాష్ట్రీయం రాజమహేంద్రవరంగా రాజమండ్రిరాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1న గెజిట్ విడుదల చేసింది. 1802లో జిల్లా కోర్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి అధికారికంగా రాజమండ్రి పేరు వాడుకలోకి వచ్చింది. క్రీ.శ 11వ శతాబ్దంలో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని రాజ రాజ నరేంద్రుడు పరిపాలించాడు. ఆయన కాలంలో ఏర్పడిన రాజమహేంద్రవరం పేరును బ్రిటీష్ పాలనలో రాజమండ్రిగా మార్చారు.

అమరావతి బస్సులు ప్రారంభంఅధునాతన సౌకర్యాలున్న ‘అమరావతి’ బస్సు సర్వీసుల్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో జనవరి 1న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 7 స్కానియా, 2 వోల్వో కంపెనీలకు చెందిన ఏసీ బస్సులకు రిబ్బన్ కటింగ్ చేశారు. దీనికి ముందు సీఎం బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన ఇంటర్నెట్ ఆన్‌లైన్ స్క్రీన్‌ను ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రధాన బస్టాండ్లలో ఉన్న సీసీ కెమెరాలు ఆన్‌లైన్ స్క్రీన్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. సంక్రాంతి లోపు మొత్తం 45 అమరావతి బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు.

హైదరాబాద్‌లో మిషన్ స్మార్ట్ డ్రైవ్మద్యం సేవించి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారిని ఇంటి వద్ద సురక్షితంగా దించేందుకు ఉద్దేశించిన మిషన్ స్మార్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31న ప్రారంభించింది. 25 కిలోమీటర్ల వరకు ఉచితంగా, అంతకుమించితే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మద్యం మత్తులో వాహననాలు నడపటం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం స్మార్ట్ డ్రైవ్ సేవలను ప్రారంభించింది. క్యాబ్ సంస్థకు హోటళ్లు, బార్ల నిర్వాహకులు మద్యం మత్తులో ఉన్నవారి వివరాలను అందించాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారి ఇలాంటి సేవలను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టారు.

తెలంగాణలో రహదారులకు రూ. 41 వేల కోట్లుCurrent Affirs తెలంగాణలో రూ. 41 వేల కోట్లతో భారీ ఎత్తున రహదారులను విస్తరిస్తామని.. పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చుతామని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనవరి 4న వరంగల్ జిల్లా మడికొండ వద్ద వరంగల్-యాదగిరిగుట్ట మధ్య 163 నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. దీంతోపాటు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లకట్ట-ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసురు మధ్య గోదావరి నదిపై నిర్మించిన భారీ వంతెనను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంపిన ప్రతిపాదనల ప్రకారం... రాష్ట్రంలో 1,800 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో రహదారుల అభివృద్ధికి రూ.41 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటుతెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జనవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రపంచంలో ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా తెలంగాణలో వైద్యం చేయాలంటే ఈ కౌన్సిల్‌లో తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లోనే వైద్యులు తమ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్ తెలంగాణలో ఆస్పత్రులపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఆస్పత్రులను నడిపే వారిపై చర్యలు తీసుకునే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది.

ఆర్థికం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపుCurrent Affirs కేంద్ర ప్రభుత్వం జనవరి 2న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.2 మేర ఎక్సైజ్ సుంకం పెరిగింది. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి డీజిల్‌పై రూ.4,300 కోట్లు, పెట్రోల్‌పై రూ.80 కోట్లు సమకూరనుంది. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల ప్రస్తుత రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.

1.7 శాతం పెరిగిన భారత్ విదేశీ రుణ భారంభారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని డిసెంబర్ 31న విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది.

‘నయీ మంజిల్’కు ప్రపంచబ్యాంకు రుణసాయంభారత్‌లో మైనారీటీలకు విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు 50 మిలియన్ డాలర్ల రుణ సాయాన్ని అందించింది. ఈ మేరకు రుణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు డిసెంబర్ 31న సంతకాలు చేశాయి. మైనారిటీ వర్గాలకు సంపూర్ణ విద్యతో పాటు వారిలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రారంభించిన ‘నయీ మంజిల్(న్యూ హారిజాన్)’ పథకానికి 50 మిలియన్ డాలర్లు రుణసాయాన్ని అందించినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీహెచ్‌ఏఎల్ హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపనCurrent Affirs కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీదరహళ్లి కావల్‌లో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 3న శంకుస్థాపన చేశారు. 15 ఏళ్లలో ఈ కేంద్రం నుంచి 600 దేశీయ హెలికాప్టర్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మోదీ వెల్లడించారు. వీటిని సైన్యానికి అందజేయనున్నట్లు చెప్పారు. 2018 నాటికి ఈ కర్మాగారం నుంచి తయారైన మొదటి దేశీయ హెలికాప్టర్ నింగిలో ఎగరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, అనంతకుమార్, సదానందగౌడ, రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా పాల్గొన్నారు.

డీఆర్‌డీఓ మానవ రహిత యుద్ధ వాహనంమానవ రహిత యుద్ధ వాహనాన్ని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి మండలి(డీఆర్‌డీఓ) సిద్ధం చేసింది. ఈ వాహనాన్ని మైసూరు నగరంలోని మానస గంగోత్రిలో ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని పుణేలోని డీఆర్‌డీఓ కేంద్రం సిద్ధం చేసింది. ఇది ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సహాయంతో నడుస్తుంది. బాంబులను కూడా కనిపెట్టి నిర్వీర్యం చేస్తుంది. ఈ వాహనంలో రోబో తొడుగుతో తయారు చేసిన వస్తువు చాలా బరువైన బాంబులను కూడా పైకి ఎత్తుతుంది. నేలలో ఉన్న బాంబులను కూడా పైకి తీస్తుంది. దీనిపై అతి బరువైన ఆయుధాలను కూడా ఏర్పాటు చేయవచ్చు.

హెడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తర కొరియాఅణుబాంబు కన్నా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా జనవరి 6న ప్రకటించింది. ‘సూక్ష్మీకరించిన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కొనే తాజా అస్త్రం సిద్ధమైంది’ అని అక్కడి అధికార టెలివిజన్‌లో ప్రకటన వెలువడింది. దీంతో ఉత్తర కొరియా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రోజన్ బాంబును తయారు చేశామని 2015 డిసెంబర్‌లో ఆ దేశ అత్యున్నత నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలకు సంబంధించిన తొలి ఆదేశాలపై డిసెంబర్ 15న, తుది ఆదేశాలపై జనవరి 3న కిమ్ సంతకం చేశారు. అణు విచ్ఛిత్తి ఆధారంగా రూపొందే అణు బాంబుల కన్నా.. సంలీన సూత్రంతో తయారయ్యే హైడ్రోజన్ బాంబ్ వందల రెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా అణు పరీక్షా కేంద్రం ‘పంగ్యేరి’ దగ్గరలో 5.1 డిగ్రీల తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని అంతర్జాతీయ భూకంప పరిశీలకులు గుర్తించారు. అయితే, భూ ప్రకంపన తీవ్రత ఆధారంగా అది హైడ్రోజన్ బాంబ్ పేలుడు కాదని తెలుస్తోందని, విఫలమైన హైడ్రోజన్ బాంబు ప్రయోగానికి కూడా అంత తక్కువ శక్తి విడుదల కాదని దక్షిణ కొరియా పేర్కొంది. అది ఉత్తర కొరియా నాలుగో అణు బాంబు పరీక్ష కావచ్చొచ్చంది.

వార్తల్లో వ్యక్తులుసీపీఐ సీనియర్ నేత బర్దన్ మృతిCurrent Affirs కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సీనియర్ నాయకులు ఎబీ బర్దన్ (91) జనవరి 2న న్యూఢిల్లీలో మరణించారు. బర్దన్ 1996 నుంచి 2012 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1957లో నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బర్దన్ కార్మిక నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

అద్నాన్ సమీకి భారత పౌరసత్వం పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు జనవరి 1 నుంచి అద్నాన్ సమీకి భారత పౌరసత్వం లభించింది. పాక్‌లోని లాహోర్‌లో జన్మించిన అద్నాన్ 2001 నుంచి వీసాపై భారత్‌ను సందర్శిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా భారత్‌లోనే నివసిస్తున్నారు.

సీఐసీగా మాథూర్ ప్రమాణస్వీకారంకేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఆర్కే మాథూర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. త్రిపుర కేడర్‌కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథూర్ గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన రానున్న మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.

ఎస్‌ఎంఈ చాంబర్స్ సలహాదారుగా అజయ్‌కుమార్ అగర్వాల్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఎంఈ చాంబర్స్‌కు సలహాదారుగా ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ డెరైక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ముంబై కేంద్రంగా 45 వేల ఎస్‌ఎంఈ సంస్థలు సభ్యులుగా 22 ఏళ్ల నుంచి ఎస్‌ఎంఈ చాంబర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్‌ఎంఈ)ను పటిష్టం చేయడం, మంచి వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్‌ఎంఈ చాంబర్స్ తగిన ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన అజయ్ కుమార్ అగర్వాల్... ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డ్‌ను, యూనిటీ తదితర అవార్డులను అందుకున్నారు.

సిరాజ్‌కు ఎన్‌జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌కు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జనవరి 4న విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరాజ్‌కు గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టరు అల్లూరి పద్మరాజు ప్రదానం చేశారు. సిరాజ్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తూ మార్కెట్ల బలోపేతంతోనే వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని, ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవంతో ఆహారోత్పత్తి పెరిగినా ఆహార సరఫరా సరైన రీతిలో జరగడం లేదన్నారు. 2030 నాటికి దేశ జనాభా 145 కోట్లకు చేరవచ్చని, అప్పటికి 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు, 32 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు.

విప్రో సీఈవోగా అబిద్ అలీదిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్‌వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ ఫిబ్రవరి నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ నుంచి నీముచ్‌వాలా విప్రోలో తన కెరీర్‌ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు. ఈయన గ్లోబల్ ఇన్‌ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్‌గా ఉన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తొలిసారిగా ఓ మహిళా వైస్ చాన్సలర్ నియమితులయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న లూయిస్ రిచర్డ్‌సన్(56) ఈ ఘనత సాధించారు. జనవరి 1న ఆమె ఆక్స్‌ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐర్లాండ్‌లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్‌మోర్‌లో ఆమె జన్మించారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్‌డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అందులోనే రాడ్‌క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్‌గా పనిచేశారు. 2009లో బ్రిటన్‌లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అవార్డులుఎం.వై.ఎస్. ప్రసాద్‌కు విక్రమ్ సారాబాయ్ అవార్డుCurrent Affirs సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మాజీ డెరైక్టర్ ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు విక్రమ్ సారాబాయ్ అవార్డు లభించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.. అంతరిక్ష శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును బహూకరిస్తుంది. మైసూర్‌లో జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రసాద్ అవార్డును అందుకున్నారు.

శేఖర్‌గుప్తాకు తిలక్ జర్నలిజం అవార్డు2015 లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డుకు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. ఈ మేరకు బాలగంగాధర్ తిలక్ ఎడిటర్‌గా పనిచేసిన ‘ కేసరి’ పత్రిక ట్రస్టీ, ఎడిటర్ దీపక్ తిలక్ ప్రకటన చేశారు

బీసీసీఐ వార్షిక అవార్డులుభారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 2015 సంవత్సరానికి గానూ వార్షిక అవార్డులు ప్రకటించింది.
అవార్డు విజేతలు:కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ - సయ్యద్ కిర్మాణీ
పాలి ఉమ్రిగర్ (ఉత్తమ క్రికెటర్) అవార్డు - విరాట్ కోహ్లి
ఎం.ఎ.చిదంబరం (ఉత్తమ మహిళా క్రికెటర్)- మిథాలీ రాజ్
లాలా అమర్‌నాథ్ అవార్డు - జలజ్ సక్సేనా (రంజీల్లో బెస్ట్ ఆల్‌రౌండర్)
లాలా అమర్‌నాథ్ అవార్డు - దీపక్ హుడా (దేశవాళీ వన్డేల్లో బెస్ట్ ఆల్‌రౌండర్)
మాధవ్‌రావు సింధియా అవార్డు - రాబిన్ ఉతప్ప (రంజీల్లో అత్యధిక పరుగులు)
మాధవ్‌రావు సింధియా అవార్డు - వినయ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ (రంజీల్లో అత్యధిక వికెట్లు)
అండర్-23 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - అల్మాస్ షౌకత్ (యూపీ)
అండర్-19 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - అనుమోల్‌ప్రీత్ సింగ్ (పంజాబ్)
అండర్-16 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - శుభమ్ గిల్ (పంజాబ్)
ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్ - దేవికా దివ్య (మహారాష్ట్ర)
దేశవాళీల్లో ఉత్తమ అంపైర్ - ఓ నందన్, ఓవరాల్ ఉత్తమ ప్రదర్శన - కర్ణాటక స్టేట్ అసోసియేషన్

కె.రాఘవేంద్రరావుకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం‘అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందుకున్నారు. జనవరి 6న హైదరాబాద్‌లో ‘సాంస్కృతిక బంధు’ సారపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్రరావుకు ఈ అవార్డును అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆయనకు స్వర్ణకంకణం, స్వర్ణ కిరీటంతో పాటు పురస్కారాన్ని అందించారు.

క్రీడలుభారత్‌కు శాఫ్ కప్దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్‌ను భారత్ గెలుచుకొంది. తిరువనంతపురంలో జనవరి 3న జరిగిన ఫైనల్లో అఫ్గానిస్థాన్‌ను 2-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ ఈ కప్‌ను గెలుచుకోవటం ఇది పదోసారి. ఇప్పటి వరకు జరిగిన 11 శాఫ్ టోర్నమెంట్లలో భారత్ ఫైనల్‌కి చేరిన 7 సార్లు టైటిల్ గెలిచింది.

ఐసీసీ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్2015 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నెంబర్ వన్ టెస్ట్ బౌలర్, ఆల్ రౌండర్‌గా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎన్నికయ్యాడు. అశ్విన్‌కు ముందు భారత్ నుంచి బిషన్ సింగ్ బేడీ 1973లో నెంబర్ వన్ బౌలర్ ర్యాంకును సాధించారు. అశ్విన్ 2015లో 9 టెస్టులు ఆడి 62 వికెట్లు పడగొట్డాడు.

గత 50 ఏళ్లలో లక్ష్మణ్‌దే ఉత్తమ ఇన్నింగ్స్Current Affirs గత 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనగా వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు గుర్తింపు దక్కింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంది. 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అందుకే ఈఎస్‌పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే మెజారిటీ సభ్యులు ఓటేశారు. పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్, జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలను ఓట్ల ద్వారా ఎంపిక చేశారు. 1981లో ఆస్ట్రేలియాపై ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్) ప్రదర్శన రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా 50 ఉత్తమ ప్రదర్శనలలో బ్రియాన్ లారా (వెస్టిండీస్) ఆడిన ఇన్నింగ్స్ నాలుగు ఉన్నాయి. బోథమ్, రిచర్డ్స్ (వెస్టిండీస్)లవి మూడు ప్రదర్శనలు ఉన్నాయి. గవాస్కర్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌కు కూడా ఈ టాప్-50 ప్రదర్శన జాబితాలో చోటు దక్కింది.

బీసీసీఐపై జస్టిస్ లోధా కమిటీ నివేదికబీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్ చట్టబద్ధం చేయాలని సూచించడం కమిటీ నుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు 2015 జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్‌లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదినలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదకను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది.
లోధా కమిటీ ప్రతిపాదనలు
  • 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు.
  • ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే.
  • ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి.
  • బీసీసీఐ అద్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ తర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు.
  • ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు.
  • సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి.
  • బెట్టింగ్‌ను చట్టబద్దం చేయడం

ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులతో ప్రపంచ రికార్డుఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఒకే ఇన్నింగ్స్‌లో వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ముంబై కుర్రాడు ప్రణవ్ ధనవాడే నిలిచాడు. ముంబై అండ్-16 స్కూల్ టోర్నమెంట్ భండారి కప్‌లో భాగంగా జనవరి 4, 5 తేదీల్లో జరిగిన రెండు రోజుల మ్యాచ్‌లో 15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు చేశాడు. ముంబై శివార్లలో థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 323 బంతులాడిన ప్రణవ్ 129 ఫోర్లు, 59 సిక్సర్లు బాదాడు. ఆర్య గురుకుల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన ప్రణవ్ తొలి రోజు 652 పరుగులతో అజేయంగా నిలిచి... చివరకు 1009 పరుగుల చేసి కూడా నాటౌట్‌గా నిలిచాడు. ప్రణవ్‌కు ముందు అత్యధిక పరుగుల రికార్డు ఆర్థర్ కొలిన్స్ పేరిట ఉండేది. 1899లో 13 ఏళ్ల వయసులో కొలిన్స్ 628 పరుగుల రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో క్లార్క్స్ హౌస్, నార్త్ టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.

షూటర్ అపూర్వీ ప్రపంచ రికార్డుభారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్‌ప్రి షూటింగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జనవరి 5న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వీ 211.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వీ 211 పాయింట్లతో యి సిలింగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రిడ్ స్టెఫెన్సన్ (స్వీడన్-207.6 పాయింట్లు), స్టిన్ నీల్సన్ (స్వీడన్-185 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates